
ఎన్నాళ్ళనుంచో నిన్ను
నా పద్య సింహాసనంమీద ప్రతిష్టించాలనుకున్నాను
నువ్విప్పుడు లేపు నీ మగ్గం వుంది
తాతా తాతా!
వెండి వెన్నెల జరీచీరల నేతగాడా
బతుకంతా బాధలబస్తాల మోతగాడా
పద్మసాలివి నువ్వు ప్రతిభాశాలివి
అగ్గిపెట్టెలో ఆరున్నర గజాల పద్యాన్ని మడచిపెట్టిన
ఆదిమ కళాకారుడివి
మా ఊరి బోసిముడ్డిమీద ఇంతగుడ్డముక్క కప్పిన
నీ ఔదార్యానికి
నిన్ను దిక్కులేని శవాన్నిచేసి
ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది
తాతా! ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల
చివరికేకలా వుండేవాడివి
ఏం రాయమంటావు తాతా
మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చుని
కాళ్ళతో అణ తొక్కుతూ
చేత్తో కుచ్చుతాడు లాగుతూ
శరీరాన్ని అటూ ఇటూ నాడితోపాటూ ఆడిస్తుంటే
నీ రక్తమాంసాలతో
ఒక మహోన్నత వస్త్రకావ్యం తయారవుతుంటే
ఆ అద్భుత దృశ్యాన్ని చిత్రించాలని
చిన్నప్పుడే నేనెన్ని కలలు కన్నాను
బతుకు నాడెలో కండల కండెను కదిలించి కరిగించి
పూరిపాకలో వస్త్రసౌధాలు కట్టిన వైభవంనీది
రామ పాదుకల్ని మా గుండెలమీద పెట్టుకుని
నీ పావుకోళ్ళని మగ్గం గోతిలోనే సమాధిచేసిన
దుర్మార్గం మాది.
రోడ్డుపొడవునా పడుగు పన్ని
నీ ఊపిరితిత్తుల్ని ఊడెత్తులు చేసి
ఎగశ్వాస దిగశ్వాస దుగసాలు కాగా
అటుపక్క నువ్వు ఇటుపక్క మామ్మ
కుంచిపట్టుకుని పరుగులు తీస్తుంటే
అద్బ్భుత కళాఖండం ఏదో ఆవిర్భవించబోతున్నట్టు
ఊరు ఊరంతా ఒకటే కోలాహలం
సంచిలో చుక్కల రత్నాలు నింపుకుని
వెన్నెల వ్యాపారి నీతో బేరానికి దిగొచ్చేవాడు
బతుకంతా ఒకే నాసిరకం
వెలుగుబట్టను నేసి నేసి అలసిపోయిన
పగటి నేతగాడు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు
కాలం కదురుమీద నరాలా దారాలతో
కండెలు చుడుతూ మామ్మ
నీ కళాకౌశలాన్ని కళ్ళతోనే మెచ్చుకునేది
తన ఖాళీ గుండెమీద జానెడు రవిక గుడ్డ కప్పలేని
నీ లేమితనానికి కాసింత నొచ్చుకొనేది
ఇంతలోనే షావుకారు
నీ కొత్తకోకని కోడిపిల్లలా తన్నుకుపోయి
పాత బాకీ కింద జమకట్టేస్తే
నీ గుండె గుడ్డ పుటుక్కున పిగిలిన చప్పుడు
నాకింకా వినబడుతూనే వుంది
తాతా తాతా నువ్విప్పుడు నా పద్యంలో
పడుగూ పేకలా అల్లుకుపో తాతా!
నా గుండె రాట్నంలో ఈ కలం కదురుకి
నువ్వు నూరోనంబరు నూలుదారానివై చుట్టుకుపో తాతా
నానెత్తుటిలో గుంజి ఆరేసిన
ఆ పద్యం పంచెలసాపుకి
నువ్వు మానవత్వపు అంచువై అంటుకుపో తాతా.
స్టోరీ స్వీకరణ దేని నుంచి తీసుకున్నాం సార్
ReplyDelete