అమ్మా తమ్ముడు ఉత్తరం రాశాడు
ఇన్నాళ్ళకి నీకు విశ్రాంతి దొరికిందని
ఏడుస్తూ రాశాడు
ఆడది కాలో చెయ్యో విరగొట్టుకుంటేనేగాని
విశ్రాంతి దొరకని దేశంలో అమ్మా నువ్వు పుట్టావు
ఇప్పుడెలా వుంది నీ చేయి?
మండు వేసవిలో విసన కర్రలాంటి చేయి
చిమ్మచీకట్లో వెలుగురేకలాంటి చేయి
చందమామచేయి - మల్లెపూవు చేయి
ఎక్కడ కదలాడితే అక్కడ
అమ్మతనాన్ని అమృతంలా వర్షించిన చేయి
నువ్వు పొద్దస్తమానం మా చుట్టూ తిరిగితే
సూర్యుడు నీ చేయి చుట్టూ తిరుగుతాడు
ఆడదాని శరీరంలో ఏ అంగాన్నీ
సజీవంగా మిగల్చని అనాగరికులం మేము
అమ్మా నీ చేయి విరగడంలో
ఒక సామాజిక నేరాన్ని చూస్తున్నాను
ఒక పెత్తందారీ దుష్టత్వాన్ని చూస్తున్నాను
పచ్చని నీ బతుకు మొక్కమీద
పన్నెండేళ్ళకే పెళ్ళి గొడ్డలిపడింది
రంగుల నీ కలల బొమ్మని
నీలో చెరిసగమైనవాడే చెరిపేశాడు
నీమీద మాతృమూర్తి మంత్రాన్ని జల్లి
నిన్నో యంత్రాన్ని చేసి
నీ అంతరాంతర నిగూఢ సౌందర్యాలనన్నింటినీ
ఎప్పుడో ఎప్పుడెప్పుడో బండబార్చారు
సూర్యుడిక్కూడా ఖచ్చితమైన పనిగంటలుంటాయి
నీకు పనే తప్ప గంటలు తెలీవు
నిన్ను చూసే కాలం తన గడియారాన్ని
సరిజేసుకుంటుంది.
జీతం బత్తెంలేని
మాయింటి పెద్ద పాలేరువు నువ్వు
కొల్లేరంత దుఃఖాన్ని కడుపులో దాచుకుని
మా సుఖాల బళ్ళాకింద నల్లేరువయ్యావు
వంటగదికీ గొడ్లచావిడికీ మధ్య
నువ్వు రేసుగుర్రానివయ్యావు
గృహలక్ష్మి పరుగుపందెంలో నువ్వే గెలిచావని
నిన్ను బెలిపిస్తూ నాన్న
అలసిన నీ శరీరాన్ని తనకు అర్పించుకోవడాన్నే
అవార్డుగా ప్రకటించాడు
అమ్మా నువ్వు పూజించిన దేవుడే
నిన్ను మోసం చేశాడు
కాలం కాన్వాసు మీద
ఆడద్దని బొమ్మకి నీ నెత్తురే పూశాడు
పొద్దు వెచ్చగా పొడుచుకొస్తున్నప్పుడో
పువ్వు స్వేచ్ఛగా విచ్చుకుంటున్నప్పుడో
రెక్కలతో పక్షులు ఆకాశాన్ని కొలుస్తున్నప్పుడో
అమ్మా నువ్వు పోగొట్టుకున్న సౌభాగ్యం
నాకు గుర్తుకొస్తుంది.
నాకు మగజన్మనిచ్చి
ఒక దుఃఖిత హృదయాన్నిచ్చి
రెండు కన్నీటి చెలమనిచ్చి
ఏ రాత్రీ నిద్రరాని జీవితాన్నిచ్చి
అమ్మా ఈ మగజాతి మీదిలా కసితీర్చుకున్నావా?
నువ్వు శపించు
శపించడం కన్నా దహించు
నీ దయగల నేత్రాలతో
ఎవరినీ క్ష్మమించకమ్మా క్షమించకు
ఎందుకమ్మా ఆ కన్నీరు
నువ్వో సారి శివాలెత్తి
ఆ నాలుగ్గోడలూ బద్దలుగొట్టుకు బయటకు రావే
నీ పాదాల దగ్గర కూర్చుని
మేం ఫెమినిస్టు పాఠాలు నేర్చుకుంటాం.
[అమ్మ నీళ్ళు మోస్తూ జారిపడిపోయినప్పుడు]
No comments:
Post a Comment