Tuesday, September 20, 2016

విశాఖ తుంపర

విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా
నడిచే నీటి దేహాన్నయిపోతాను
పలకరింపుగా ఎవరు తాకినా
వారి వేళ్ళల్లో నీటి గలలగలకే.

నేను సముద్రాన్నయితే......
సముద్రం నా ముందు కూర్చుంటుంది.
వేల సంత్సరాల జ్ఞాపకాలేవో .... ఇసుకరేణువులై
నాలో మేటవేస్తుంటే
తరంగాలు తరంగాలుగా నేను పడి లేస్తుంటాను
సముద్రం పకాలున నవ్వుతూ
పాత ముచ్చట్ల మూట విప్పుతుంది
సముద్రం దగ్గరకు వెళ్ళినప్పుడల్లా
ఇసుక పొరల్లో శతాబ్దాల నాటి
ఏ భగ్న ప్రేమికుడి పాదముద్రనో అయిపోతాను
ఇసుకమీద ఏ మహాకవో రాసిన
వాక్యం తాలూకు తడితడి ఆనవాలుగా మారిపోతాను

పక్కనే ఉన్నా...దోస్తులు తీరమంతా వెదుకుతారు నాకోసం
నేను మాత్రం ఆది అంతాల మధ్య కడలిపై తేలియాడే
మనిషి భౌతికకాయం నుండి వీచే
నైతికానైతిక నిశ్యబ్ద వాయుశబ్దాన్ని వింటాను.
సముద్రం ఏదో చెప్పాలనుకుంటుంది నాకు
కాదు, నేనే ఏదో వినాలనుకుంటా
సముద్రం నాకు సంగీతం
సముద్రం నాకు సాహిత్యం
విశాఖనుండి ఏం తెచ్చావని అడుగుతుంది తను
పద్యం తెచ్చానని నిలువెత్తు నీటిబొట్టునై
ఆమె ముందు చిటుక్కున చితికిపోతాను
విశాఖ వెళ్ళొచ్చినప్పుడల్లా ఇంతే.
ఎక్కడ నిలబడ్డా
అందరిమీదా నీటి తుంపర్లే.