Tuesday, August 19, 2008

నాన్నగారు

నాన్నగారూ మాకు తెలుసు
మీరు అమ్మ దగ్గరికే వెళ్ళారని
ప్రయణాలంటే మీకు ఇష్టమేకదా

మీరు లేరంటే మీరింక తిరిగి రారంటే
ఎందుకో నమ్మలేక పోతున్నాం

పొద్దున్నే కొళాయిలో నీళ్ళచప్పుడు లాగా
మాకు అలవాటైన మీ అడుగుల చప్పుడు కోసం
రిక్కించిన మా చెవుల్ని
నిశ్శబ్దమే వెక్కిరిస్తోంది.

నాన్నగారూ అన్నం తిందాంరండని
అలవాటుగా పిలిస్తే
పక్కనున్న కంచంలో శూన్యం పరిహాసంగా నవ్వుతోంది.

యథాలాపంగా మీరు విశ్రమించే గదివైపు తొంగి చూస్తే
మీ శరీర సౌరభాన్ని కోల్పోయిన మంచం
ఒంటరిగా దిగులు చూపులు విసురుతోంది.

మీరున్నారంటే
ఆకాశమంత ఆశీర్వాదం
మాకు గొడుగుపట్టినట్టుగా ఉండేది

మీరు పక్కనుంటే
ఒక నది పక్కనున్నట్టు
మీరు చెంతనుంటే
చెట్టునీడనున్నట్టు
మీరు మా మధ్యనుంటే
చీకట్లో దీపం చుట్టూ కూర్చున్నట్టు
కొండంతా ధైర్యంగా ఉండేది.

మీరు ఎక్కడున్నా
టెలిఫోనులో అమ్మా అంటూ నాన్నా అంటూ
మీ పలకరింపు వింటే
ఒక చల్లని మబ్బుతునక
మా వీపుల్ని తడుముతున్నట్టుండేది.

ప్రేమించడమేగాని ద్వేషించడం తెలీదు మీకు
క్రమశిక్షణ మీరు మాకిచ్చిన నజరానా
స్థితిప్రజ్ఞత్వానికి మీరే చిరునామా

నాన్నగారూ
మీరు మాకు పాఠాలు భోధించారు కాని
జీవన రహస్యాలు చెప్పలేదు
షెల్ఫ్ లో దాచివుంచిన గొప్ప పుస్తకంలాగా
మీరు మా మధ్యనే ఉన్నా
మిమ్మల్ని చదవడానికి ఏనాడూ మేం సాహసించలేదు.

ఏ మహాగ్రంథాలూ చదవనవసరం లేదు
ఏ మహాయుద్ధాలు చెయ్యనవసరం లేదు
మీ బతుకు పుస్తకాన్ని తెరిస్తే చాలు
మా బతుకుల్ని మేం చక్కదిద్దుకోగలం

మీరు మాస్టారు కదా!
క్రమశిక్షణ తప్పి డబ్బుపొరలు కప్పి
స్వార్థాలు ఏవో మమ్మల్ని విడదీస్తున్నప్పుడు
ద్వేషాలు ఏవో మమ్మల్ని లొంగదీసుకుంటున్నప్పుడు
మళ్ళీ ఒక సారి
బెత్తం పట్టుకుని రావాలి సుమా!

నాన్నగారూ!
అమ్మతో పాటు ఆకాశంలో
మీరలా వాహ్యాళికి వచ్చినప్పుడు
మాకోసం మీ కళ్ళు వెదుకుతున్నప్పుడు
మీ చల్లని దీవెనల విరిజల్లుల కోసం
మేం దోసిళ్ళుపట్టుకు నిలుచుంటాం.

[నన్ను కన్న కొడుకులా ప్రేమించిన మా మామగారు కలపాల వెంకటేశ్వర రావు గారి స్మృతిలో]

Friday, August 1, 2008

వాన

ఉదయం పూట వాన


ఎవరో తలుపుతట్టినట్టు


చూస్తే


తడిసి తడిసి వణికి పోతున్న పిట్టల గుంపు







నిజంగా ఈ వాన గమ్మత్తుగా ఉంది


మంత్ర గత్తెగా ఉంది మార్మికంగా ఉంది





వాన నీటిలో ఆడుకుంటున్నాడో పిల్లాడు


వాడి కళ్ళలో కోటి కలల కత్తిపడవలు


వర్షంలో తడిసి చివికిపోయిన కాగితప్పడవలా నేను.






నన్ను చూస్తే వాడికెంత వేళాకోళంగా వుందంటే


తొడుక్కున్న చొక్కావిప్పి గిర్రున గిరాటు వేసి


నన్ను వెక్కరిస్తూ చూశాడు




కురుస్తున్న వర్షానికి దూరంగా నిలబడి


జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్నాడు.





ఉదయం పూట వాన


నింగికీ నేలకీ మధ్య పరచిన


పట్టుదారాల పడుగులా ఉంది





అప్పుడు, చెడ్డీల వయసప్పుడు


పొలందగ్గర చెరువు గట్టు మీద


ఎవరూ లేరు కదా అని


వర్షంలో బోసి ఒంటితో గెంతులేసిన జ్ఞాపకం


కితకితలు పెడుతోంది.





ఈ ఉదయం పూటవాన


నింగి పువ్వు నుండి నేలరాలుతున్న


చమ్కీల పుప్పొడిలా ఉంది.





పైన కుండపోతగా వాన


కింద నిలువెల్లా ఉబ్బిన చెరువు


చుట్టూ తామరపూలు


మధ్యలో ఈతకొడుతూ నేను


గట్టుమీద తడిసిన పుస్తకాల సంచీతో చెల్లి





అబ్బబ్బా ఈ ఉదయం పూట వాన


జ్ఞాపకాల రీళ్ళు గిరగిరా తిప్పుతోంది.





ఎవరో ఒక మిత్రుడైనా రాకపోతాడా అని


రాత్రంతా ఎదురు చూసి పడుకున్నాను


అందుకే పొద్దున్నే ఈ వాన


లక్ష చేతులతో నన్ను చుట్టేసింది.





వాన వాన వాన - నాలో నీలో అందరిలోనా


కురుస్తుంది కురుస్తుంది


బాబూ! బాబూ! అమ్మ పిలుస్తుంది





పీడకలేదో వచ్చినట్టు నటించి


నాన్నను తోసేసి అమ్మపక్కలో పడుకున్నాను


అమ్మ తీయ్యగా జోకొడుతున్నట్టుంది వాన





ఎంత చిత్రంగా కురుస్తోందో!


నాలో ఏం తవ్వుకు పోదామనోగాని


సూటిగా కళ్ళల్లోంచి గుండెల్లొకి మెత్తగా దిగబడుతోంది


ఊరిని ముంచేసిందో సారి గాలివాన



అప్పుడలా గూడెం గుడిసెలు



వాన నీటిలో పడవల్లా తేలిపారిపోతుంటే




గుండెలేని ఊరు గేట్లు మూసేసింది




చెమ్మగిల్లిన కళ్ళతో నేను చాచిన చేయి




ఇంకా అలా బిర్రబిగుసుకోనే ఉంది.









వానమ్మా వాన - మాయదారి వాన - మహమ్మారివాన




కన్నీటివాన - కనకాంబరాల వాన




నవ్వులవాన - ఏడ్పులవాన - జాతర వాన - జ్ఞాపకాలవాన













ఆకాశంలో చుక్కలన్నీ ఎవరో పొడి పొడి చేసి జల్లెడ పడితే




తళుకు తళుకున నేలకు రాలిపోతున్నట్టు వాన








పైలోకంలో వున్న కవులంతా




కుండపోతగా పద్యాలు నేలకు క్రుమ్మరిస్తున్నట్టుంది వాన








అమ్మ నడికి పొమ్మని




నాన్న పొలం రమ్మని




నా చదువుకోసం అత్తింటికీ పుట్టింటికీ మధ్య




అమ్మ తీసిన పరుగుల జడిలా వుంది వాన








వీధి మొగలో గోలీకాయలాడుతుంటే


నానమ్మ కర్రతో ప్రత్యక్షం


చటుక్కున చట్టెకి చెట్టుమీంచి చెరువులోకి దూకి


తామరాకుల కిందనుంచి నక్కి నక్కి చూస్తే


గట్టు మీద నానమ్మే కాదు


చెరువు చెరువంతా ఫక్కుమని కెలకవేసింది.




ప్రపంచంలోని పిల్లలంతా


ఆకాశాన్ని గాలిపటంచేసి


నవ్వులదారాలు పట్టుకుని ఆడుకుంటున్నట్టుంది వాన


అకాశరాజు భూదేవికి పెడుతున్న


చల్లని జల్లుల కితకితల్ల వుంది వాన.




అన్నం తింటున్నప్పుడు పొలమారితే


ఎక్కడో దూరాన ఉన్న అమ్మ


కొడుకా అని పలవరిస్తూ నెత్తిమీద సుతారంగా చేత్తో


తడుతున్నట్టుంది వాన




ఆ కుర్రాడు అలా ఆడుకుంటూనే ఉన్నాడు


ఆడుకుంటూ అల్లరి కళ్ళతో


నన్ను ఆట పట్టిస్తూనే ఉనాడు




సన్న సన్నగా వాన - చల్ల చల్లగా వాన


జల్లులు జల్లులుగా వాన - తుంపర తుంపరగా వాన


ఈ ఉదయం పూట వాన


నా హృదయాన్ని స్మృతుల మునివేళ్ళతో


మీటుతోనే ఉంది.