Saturday, January 16, 2010

జాయ్ ఆఫ్ గివింగ్


జాయ్ ఆఫ్ గివింగ్
మీనింగాఫ్ లివింగ్
ఐడియా అదిరింది
ఇవ్వడం అంటే ఇవ్వడమే.
తీసుకోవడానికి పన్నే వ్యూహం కాదు
మబ్బుచెలమ చెలిమి
సెలయేతి గలగలల కలిమి
ఉదయ కిరణం వెచ్చదనం..
గాలి కెరటం చల్లదనం
వాటికి తెలుసు ఇవ్వడమంటే ఇవ్వడమేనని

మన గుండెల్లో ఆనందాన్ని తోడి
మరో మనసు మడిని తడపాలి
పెదాలమీద పువ్వుల్ని కోసి
ఇరుగుపొరుగు గుమ్మాలకు వేలాడదీయాలి
కళ్ళల్లో కాంతులు .... కలల్లో ఆశలు
ఇచ్చుకో...ఎవరికైనా ఇచ్చుకో..

ఇచ్చుకోవడమంటే
పుచ్చుకోవడానికి వేసే
పకడ్బందీ పథకం కాదు
కడుపునిండా అన్నం తింటున్నపుడో..
కంటినిండా కునుకుపడుతున్నపుడో..
నువ్వెవరికో పట్టెడన్నం పెడుతున్నట్టు
అనాథ బిడ్డనెవరినో జోకొడుతున్నట్టు
ఒక పాట సన్నగా
నీ ఇంటి గోడల గొంతుల్లోంచి జాలు వారాలి

ఇవ్వు...
జీతంలోంచో...జీవితంలోంచో
కొంచెం పక్కన పెట్టి పక్కవాడికివ్వు..
కొడుక్కిచ్చినట్టో ..కూతురికిచ్చినట్టో అపరిచయస్తులక్కూడా
ఆత్మీయతల ఆలింగనాలిచ్చి
మబ్బు నీడతో ఆడుకుంటున్న
గరికపచ్చ మైదానంలా గాలికి అలా అలా తేలిపో..
కష్టపడి దాచుకోవడం కష్టమే...
ఇష్టపడి ఇచ్చుకోవడంలోని ఆనందాన్ని తట్టుకోవడం మరీ కష్టం..

ఏ రిజిష్ట్రార్ ఆఫీసులోనూ
రక్తకణాల దస్తావేజులుండవు
కాగితాలమీద అక్షరాల్లో ఆస్తులు
గీతల్లో సరిహద్దులు..
మనదంటూ ఏదీ కాదన్న మాట మట్టికి మాత్రమే తెలుసు.

చాచిన చేతుల్లో నిన్ను నువ్వు వొంపుకో
జాలి చూపుల్లో నిన్ను నువ్వు నింపుకో
మనదీపంలోంచి కాస్త వెలుగు...
మన ఇంద్రధనుస్సుల్లోచి నాలుగు రంగులు
అలా జల్లుకుంటూ వెళ్ళిపోదాం
మనిషినీ మనిషినీ అల్లుకుంటూ సాగిపోదాం
ఆర్టాఫ్ లివింగ్ అంటే ఆర్టాఫ్ గివింగే.

[జాయ్ ఆఫ్ గివింగ్ డే సందర్భంగా]

Saturday, January 9, 2010

తాతకో నూలుపోగు


ఎన్నాళ్ళనుంచో నిన్ను
నా పద్య సింహాసనంమీద ప్రతిష్టించాలనుకున్నాను
నువ్విప్పుడు లేపు నీ మగ్గం వుంది

తాతా తాతా!
వెండి వెన్నెల జరీచీరల నేతగాడా
బతుకంతా బాధలబస్తాల మోతగాడా
పద్మసాలివి నువ్వు ప్రతిభాశాలివి
అగ్గిపెట్టెలో ఆరున్నర గజాల పద్యాన్ని మడచిపెట్టిన
ఆదిమ కళాకారుడివి

మా ఊరి బోసిముడ్డిమీద ఇంతగుడ్డముక్క కప్పిన
నీ ఔదార్యానికి
నిన్ను దిక్కులేని శవాన్నిచేసి
ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది

తాతా! ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల
చివరికేకలా వుండేవాడివి

ఏం రాయమంటావు తాతా
మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చుని
కాళ్ళతో అణ తొక్కుతూ
చేత్తో కుచ్చుతాడు లాగుతూ
శరీరాన్ని అటూ ఇటూ నాడితోపాటూ ఆడిస్తుంటే
నీ రక్తమాంసాలతో
ఒక మహోన్నత వస్త్రకావ్యం తయారవుతుంటే
ఆ అద్భుత దృశ్యాన్ని చిత్రించాలని
చిన్నప్పుడే నేనెన్ని కలలు కన్నాను

బతుకు నాడెలో కండల కండెను కదిలించి కరిగించి
పూరిపాకలో వస్త్రసౌధాలు కట్టిన వైభవంనీది
రామ పాదుకల్ని మా గుండెలమీద పెట్టుకుని
నీ పావుకోళ్ళని మగ్గం గోతిలోనే సమాధిచేసిన
దుర్మార్గం మాది.

రోడ్డుపొడవునా పడుగు పన్ని
నీ ఊపిరితిత్తుల్ని ఊడెత్తులు చేసి
ఎగశ్వాస దిగశ్వాస దుగసాలు కాగా
అటుపక్క నువ్వు ఇటుపక్క మామ్మ
కుంచిపట్టుకుని పరుగులు తీస్తుంటే
అద్బ్భుత కళాఖండం ఏదో ఆవిర్భవించబోతున్నట్టు
ఊరు ఊరంతా ఒకటే కోలాహలం
సంచిలో చుక్కల రత్నాలు నింపుకుని
వెన్నెల వ్యాపారి నీతో బేరానికి దిగొచ్చేవాడు
బతుకంతా ఒకే నాసిరకం
వెలుగుబట్టను నేసి నేసి అలసిపోయిన
పగటి నేతగాడు నీ దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు

కాలం కదురుమీద నరాలా దారాలతో
కండెలు చుడుతూ మామ్మ
నీ కళాకౌశలాన్ని కళ్ళతోనే మెచ్చుకునేది
తన ఖాళీ గుండెమీద జానెడు రవిక గుడ్డ కప్పలేని
నీ లేమితనానికి కాసింత నొచ్చుకొనేది

ఇంతలోనే షావుకారు
నీ కొత్తకోకని కోడిపిల్లలా తన్నుకుపోయి
పాత బాకీ కింద జమకట్టేస్తే
నీ గుండె గుడ్డ పుటుక్కున పిగిలిన చప్పుడు
నాకింకా వినబడుతూనే వుంది
తాతా తాతా నువ్విప్పుడు నా పద్యంలో
పడుగూ పేకలా అల్లుకుపో తాతా!
నా గుండె రాట్నంలో ఈ కలం కదురుకి
నువ్వు నూరోనంబరు నూలుదారానివై చుట్టుకుపో తాతా
నానెత్తుటిలో గుంజి ఆరేసిన
ఆ పద్యం పంచెలసాపుకి
నువ్వు మానవత్వపు అంచువై అంటుకుపో తాతా.

Friday, January 8, 2010

అమ్మా క్షమించు


అమ్మా బావున్నావా?
నిన్ను పనిమనిషిగా మార్చేసిన
నీ పసుపూ కుంకుమా పదిలమేనా
నీరెక్కలగుర్రం మీద
ఇంకా ఎవరెవరు స్వారీ చేస్తున్నారు?
పోస్టుమేన్ నావార్తలు మొయ్యడానికే పుట్టినట్టు
రైళ్ళూ బస్సులు నన్ను తిప్పడానికే తిరుగుతున్నట్టు
నీ పిచ్చి ప్రేమతో యింకా
నలుగురినీ నవ్విస్తున్నావా?

రానులేవే అమ్మా రాలేను
నిన్ను చూడాలన్న దిగులుకంటే నాకు
ప్రయాణాల ఖర్చుల మీదే భయమెక్కువ
నువ్వు నాకు రక్తాన్ని పంచిస్తేనేమి?
నేను నీకు నాలుగు రూపాయలు పంపడానిక్కూడా
నలభై సార్లు జేబు తడుముకోవాలి.

అమ్మ నేనింకా నీ చేతుల తీగలమీద
అటూ ఇటూ ఆడుకున్న తూనీగనే అనుకున్నావా
నీ వొడిపువ్వులో వెచ్చగా ముడుచుకు పడుకున్న
ఆనాటి పిల్ల తుమ్మెదనే అనుకున్నావా?

నేను చాలా పెద్దవాడినయ్యానమ్మా
పెద్ద పెద్ద పనులే నేర్చుకున్నాను
నువ్వు గోరుముద్దలు తినిపించిన ఈ నోరు
కోటి అబద్ధాల కోటయిపోయింది
నీ చల్లని పెదాలు తాకినచోట
దొంగ నవ్వుల రౌడీమూకలే రాజ్యమేలుతున్నాయి
దోబూచులాటల్లో నిన్ను పరుగులు తీయించిన నాకు
ఇప్ప్పుడు బతుకే పెద్ద దొంగాటయిపోయింది
నీ ముఖమల్ గుండెలమీద
ముద్దు ముద్దుగా నడిచిన ఈ పాదాలు
ఇప్పుడు యుద్ధభూమిలో పరుగులు తీస్తున్నాయి
రోజూ తినే తిండి పెళ్ళాం పిల్లల ముద్దులు కూడా
ఇప్పుడొక యుద్ధానంతర విజయ చిహ్నలే అయిపోయాయి

మాటలూ చేతులూ
అబద్ధానికి పర్యాయపదాలై పోయ్యాయి
అమ్మా నీమెడు ఉయ్యేల లూగిన ఈ చేతులు
అబద్ధపు ఆకాశం కింద
బతుకు చొక్కాని తిరిగేసి తొడుక్కున్నాయి

అమ్మా నేనింకా నీజంట కన్నుల్లో విరిసిన
ఆనాటి చిన్ని దీపపుష్పాన్నే అనుకున్నావా
నేను మాత్రం ఎన్ని అనుకోలేదు
చిన్నప్పుడు -
నీ చుట్టూ నేను నాచుట్టూ నువ్వు పరుగులు తీసినప్పుడు
పచ్చని నీబతుకు కొమ్మమీద
కష్టాల గొడ్డళ్ళు పడుతున్నప్పుడు
శరీరాన్ని తప్ప నీ హృదయాన్ని తాకలేని పసుపుతాడు
నీజీవితం చుట్టూ బిగుసుకుంటున్నప్పుడు
అమ్మా నేనూ ఎన్నో అనుకున్నాను

నోటిని సముద్రం చేసి
నీ గుండెలమీద కూర్చున్న బాధల సూర్యుణ్ణి
గుటుక్కున మింగేయాలనుకున్నాను
నీకోసం అమృతాన్ని తెచ్చి
ఈ దగుల్బాజీ దాసీత్వంనుండి
నిన్ను విడపించాలనుకున్నాను

అమ్మా నిన్ను నానెత్తిమీద దీపంలా వెలిగించుకుని
ఈ చీకటి మొహాలకి చెమటలు పట్టించాలనుకున్నాను
ఎన్ని చెప్పినా ఇప్పుడేం లాభంలేవే అమ్మా
నన్ను నీవైపుకు లాక్కునే
బలమైన మోపులూ పలుపులా చాలా వున్నాయిక్కడ

అమ్మా నిన్ను నావీపు మీద కూర్చోబెట్టుకోని
ఈ కష్టాల కడలిని దాటిస్తాననుకున్నావా
పిచ్చిదానా పిచ్చిదానా
నీ పేగు తెంచుకు బయట పడ్డవాణ్ణి
నీ ప్రేమ తెంచుకు పారిపోలేననుకున్నావా?

Wednesday, January 6, 2010

రోడ్డు మీద పికాసో


ఎవరెవరికి ఏ విధంగా తెల్లారినా
మా పికాసోకి మాత్రం
రోడ్డు మీదే తెల్లారుతుంది
రోడ్డు ప్రసవించిన కొత్తరంగు వాడు

బాలార్క కిరణాలు ఇంకా
బజారున పడకముందే
అదృష్టవంతులు దుప్పటి ముసుగులింకా
తీయ్యక ముందే
మా వాడు
రాత్రంతా తనదేహాన్ని కాపలా కాసిన
చినుగుల చొక్కా ఊడదీసి
రోడ్డు ఊడ్వడం ప్రారంభిస్తాడు
దీక్షగా రోడ్డు తల్లి దేహాన్ని శుభ్రం చేసి
ఆకలి పచ్చబొట్లు పొడవడానికి ఉపక్రమిస్తాడు
ఆకలి ఏ రంగులో ఉంటుందో
మా వాడే చెప్పగలడు
రోడ్డు పెగుతెంచుకు పుట్టిన పికాసోవాడు

ఆకలి వాడిని తరిమితే
వాడు రోడ్డును తడుముతాడు
రోడ్డు కాన్వాసుమీద వాడు
చిత్రకళా బీజాక్షరాలు చెక్కుతాడు
తల దాచుకోవడానికి
ఎక్కడా చోటు దొరక్కపోయినా
తన కళదాచుకోడానికి
రోడ్డు ఆశ్రయమిచ్చింది వాడికి
అవతరిస్తారు
ఏడుకొండలవాడూ ఏసుక్రిస్తు మహమ్మదు ప్రవక్త
పక్కపక్కనే
కులాలూ మతాలు కత్తులు దూసుకునే చోట
మసీదులూ మందిరాలూ నెత్తురు జుర్రుకునే చోట
మా వాడు మతసామరస్యాన్ని
సుద్దముక్కలతో అద్దం పట్టిస్తాడు

వేసిన బొమ్మదేవుళ్ళకి
చిల్లర రాళ్ళను కాపలా పెట్టి
చేతి సంచీ పట్టుకుని చిటుక్కున మాయమవుతాడు
ఎక్కడ కూర్చుంటాడో గాని
ఇక్కడ బొమ్మమీద ఒక నాణెం పడితే
అక్కడ మావాడికి పొట్టమీద్ చెయ్యేసి
అమ్మ ఆప్యాయంగా తడిమినట్టనిపిస్తుంది

జనం చూస్తుంటారు
ఏ రక్తం ఈ రంగుల్ని రాల్చిందో
ఏ ఆకలి పేగుల పాములు చుట్టలు విప్పుకుంటున్నప్పుడు
ఆ బొమ్మ రూపుగట్టిందో
అర్థమైనట్టే తలలు ఆడిస్తారు
ఇటుపోయేవాడొక నాణెం
అటుపోయేవాడొక నాణెం

తన పొట్ట కొడుతున్నాడని
కసితో కాండ్రించి ఉమ్మేద్దామని వచ్చిన బిచ్చగాడుకూడా
అప్రయత్నంగా సత్తుగిన్నెలో మిగిలిన
ఒక్కనాణేన్నీ బొమ్మమీద విసిరేసి
ఆ సందువదిలి
ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు
సద్దు మణిగిపోతుంది
పగలంతా బొమ్మకు కాపలా కాసిన సూరీడు
బత్తెం మాట అడక్కుండానే
చిత్తం వెళ్ళొస్తానంటాడు
అందరూ తమతమ దేహాల్ని శుభ్రం చేసుకుని
మంచాలకెక్కించేవేళ
ఏ అనాధాశ్రయంలోనో
కన్నబిడ్డను వదలలేక వదలలేక
వదిలిపోయే అభాగ్యురాలిలాగా
తన బొమ్మను రోడ్డుకే అంకితం చేసి
వాడు మరోచోటుతి
మౌనంగా వెళ్ళిపోతాడు.

Monday, January 4, 2010

కాలువ సంబరంలో మా ఊరు

విజయోత్సాహంతో
యుద్ధం నుండి తిరిగొస్తున్న
వీరుడిలా వస్తుంది కాలువ
కాలువ వదిలినప్పుడు చూడాలి
మా ఊళ్ళో సందడి

తలుపు సందుల్లోని చేతికర్రలు
చెప్పులు తొడుక్కుని చేతులూపుకుంటూ
పొలంగట్టుకు బయలుదేరతాయి

మూల పడివున్న నాగలికర్రలు
మునుపటి జ్ఞాపకాలేవో ముసురుకోగా
ఎవరో కితకితలు పెట్టినట్టు కిర్రుమంటాయి
మట్టితో తమకున్న మానవీయ బంధాన్ని
మౌనంగా స్మరించుకుంటాయి

ఎండలగొడ్డళ్ళ తాకిడికి
పగుళ్ళిచ్చిన పంటభూములను
జలజహ్వికలతో స్పృశిస్తూ
పరామర్శించడానికి పరవశంగా వస్తోంది కాలువ
కాలువ వదిలినప్పుడు చూడాలి
మా ఊరి కోలాహలం

దొడ్లో ఆకుమడి విత్తనాలకోసం దాచిపెట్టిన
ఒడ్లబస్తాకు
కెరటాలు కెరటాలుగా
వురిటినప్పులు ప్రారంభమవుతాయి

పాకల్లో ఎద్దులు గుంజలకు మెడలు రాసుకుంటే
ఇళ్ళలో ఎక్కడో చిలకొయ్యలకు వేలాడే గంటలు
త్రుళ్ళింతలతో ఘల్లుమంటాయి

తుమ్మ చెట్ల నీడలు
ఉప్పటి చమట తడికోసం
ఉబలాట పడతాయి

మా వూరి బాల భగీరథులు
గోచిగుడ్డల్ని జెండాలుగా వూపుతూ
ఉరికొస్తున్న కాలువకు
ఉత్సాహంగా స్వాగతం పలుకుతారు

పనుల్లేని రోజుల్లో పస్తులున్న వాళ్ళని
పలకరించడానికి వస్తున్న ఆత్మ బంధువులా వస్తోంది కాలువ
కాలువ వదిలినప్పుడు చూడాలి
మా ఊళ్ళో సంబరం

కరువు కాలంలో
కూలి జనాలు తాకట్టు పెట్టిన కుండామండా
విముక్తి రాగాన్ని ఆలపిస్తాయి
సత్తుసేవండి టపినీలు తళతళా మెరుస్తాయి
మా కాంతం పిన్ని పాతచీర
కొత్త కుట్లతో ముస్తాబవుతుంది.

చద్దిమూటల కోసం దాచిపెట్టిన పాతగుడ్డలు
అన్నం తడి తగలబోతున్నందుకు
ఆనందంలో పిగిలిపోకుండా
గుండెలు ఉగబట్టుకుంటాయి

షావుగారు గారి జాడీల్లో
ఊర్గాయబద్దకి
ఉన్నట్టుండి ధర పెరిగిపోతుంది

ఊరవతలి గూడెం జనాలు
ఊళ్ళో బుగతగారికి
అకస్మాత్తుగా గుర్తుకొస్తారు
కూలిరేట్లు పెరక్కుండా
మండువా లోగిళ్ళలో
మంతనాలు మొదలవుతాయి

ఎద్దులు పొలాలకు పోయినా
లేగదూడలు పాకల్లోనే వుంటాయి
కానీ మా ఊరి ఎలిమంట్రీ స్కూల్లో
హాజరీ పూర్తిగా డౌనయిపోతుంది

ఏమీ ఎరగనట్టు వస్తుంది కాలువ
మా ఊరిని మాత్రం
ఎక్కడ ముఉట్టుకుంటే అక్కడ
కొత్త మొలకలు పుట్టుకొస్తాయి.

కవి


ఎన్నడూ ఓ ముద్దకూడా వెయ్యని ఇంటిముందు
రోజూ విధిగా నిలబడే బిచ్చగాడిలాగా
ఈ జీవన వాకిలిముందు నిలబడి
వాడు కవితా గానం చేస్తాడు
మనం తలుపులు మూసేసుకుంటాం.

జీవితాన్ని ప్రేమించలేనివాడు
కవిత్వాన్ని ప్రేమించలేడు.

నాకు కవులంతా యుద్ధభూమిలో నెత్తురోడుతున్న
సైనికుల్లా కనబడతారు.
మనం రాత్రుల్ని వెలిగించుకుని చలికాచుకుంటాం
వాడు రాత్రుల్లో మండిపోతాడు మాడిపోతాడు మసైపోతాడు

గుండెకి ఒక కొసన నిప్పంటించుకుని
ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క
ఒక అక్షరానికి ఓ నెత్తుటిబొట్టు ఇచ్చి
అక్షరాల్లోకి అంతర్థానమైపోతాడు

కవిగాడిని చూడ్డవూ
మిట్టమధ్యాహ్నం రవిగాడిని చూడ్డవూ ఒక్కటే

దూరిపోతాం
ఇళ్ళ దుప్పట్ల కౌగిళ్ళ సొరంగాల్లోకి దూరిపోతాం
ముందు తలదూర్చి
తరువాత కాళ్ళూ చేతులూ దేహాలూ లాక్కుని
హాయిగా నిద్రపోతాం.
కవిగాడు కావుకావుమంటూ
మన నీడల మేడల పిట్టగోడల మీద
అలుపులేకుండా అరుస్తాడు
ఎవరో చుట్టం వస్తున్నాడని
చూట్టానికి సాహసిస్తాం.

వలయాలు వలయాలుగా శూన్యం
ఇంటి చుట్టూ కన్నాలు
కన్నాల్లో కన్నీటి తడి
దొంగ కనీటి దొంగ!

తలుపులు మూసుకుని ఏడ్చినా
మన కనీటిని దోచుకుపోయేవాడు కవే
కనీటి కుండల్ని నెత్తిమీద ఒక దానిపైనొకటి పేర్చుకుని
ఎర్రటి మన గుండెల నిప్పుల మీంచి వాడు
పీరుసాయిబులా నడుచుకుంటూ పోతాడు

సిగ్గు పడతాం ముడుచుపోతాం
వాడు పాటలపిట్టల రెక్కల కుచ్చులతో
మన రెప్పలచివర్ల అశ్రుకణాల్ని తుడిచి
మనల్ని ఏడవొద్దని వోదారుస్తూ
వాడు బావురుమని ఏడ్చేస్తాడు

పలకరించామా
మనల్ని ఆరణ్యాల్లోకి విసిరేస్తాడు
క్రూర మృగాలతో మనం పోరాడలేక
వెనక్కి తిరిగి పోతున్నప్పుడు
మనల్ని దారికాచి నిలబెట్టి ఆయుధాన్నిచ్చి
తిరిగి యుద్ధానికి పంపుతాడు

కవిని ముట్టడమూ
కత్తిని చేపట్టడమూ ఒక్కటే.

అమ్మా ఫెమినిస్టువి కావే

అమ్మా తమ్ముడు ఉత్తరం రాశాడు
ఇన్నాళ్ళకి నీకు విశ్రాంతి దొరికిందని
ఏడుస్తూ రాశాడు

ఆడది కాలో చెయ్యో విరగొట్టుకుంటేనేగాని
విశ్రాంతి దొరకని దేశంలో అమ్మా నువ్వు పుట్టావు

ఇప్పుడెలా వుంది నీ చేయి?
మండు వేసవిలో విసన కర్రలాంటి చేయి
చిమ్మచీకట్లో వెలుగురేకలాంటి చేయి
చందమామచేయి - మల్లెపూవు చేయి
ఎక్కడ కదలాడితే అక్కడ
అమ్మతనాన్ని అమృతంలా వర్షించిన చేయి

నువ్వు పొద్దస్తమానం మా చుట్టూ తిరిగితే
సూర్యుడు నీ చేయి చుట్టూ తిరుగుతాడు

ఆడదాని శరీరంలో ఏ అంగాన్నీ
సజీవంగా మిగల్చని అనాగరికులం మేము
అమ్మా నీ చేయి విరగడంలో
ఒక సామాజిక నేరాన్ని చూస్తున్నాను
ఒక పెత్తందారీ దుష్టత్వాన్ని చూస్తున్నాను

పచ్చని నీ బతుకు మొక్కమీద
పన్నెండేళ్ళకే పెళ్ళి గొడ్డలిపడింది
రంగుల నీ కలల బొమ్మని
నీలో చెరిసగమైనవాడే చెరిపేశాడు
నీమీద మాతృమూర్తి మంత్రాన్ని జల్లి
నిన్నో యంత్రాన్ని చేసి
నీ అంతరాంతర నిగూఢ సౌందర్యాలనన్నింటినీ
ఎప్పుడో ఎప్పుడెప్పుడో బండబార్చారు

సూర్యుడిక్కూడా ఖచ్చితమైన పనిగంటలుంటాయి
నీకు పనే తప్ప గంటలు తెలీవు
నిన్ను చూసే కాలం తన గడియారాన్ని
సరిజేసుకుంటుంది.
జీతం బత్తెంలేని
మాయింటి పెద్ద పాలేరువు నువ్వు
కొల్లేరంత దుఃఖాన్ని కడుపులో దాచుకుని
మా సుఖాల బళ్ళాకింద నల్లేరువయ్యావు
వంటగదికీ గొడ్లచావిడికీ మధ్య
నువ్వు రేసుగుర్రానివయ్యావు

గృహలక్ష్మి పరుగుపందెంలో నువ్వే గెలిచావని
నిన్ను బెలిపిస్తూ నాన్న
అలసిన నీ శరీరాన్ని తనకు అర్పించుకోవడాన్నే
అవార్డుగా ప్రకటించాడు

అమ్మా నువ్వు పూజించిన దేవుడే
నిన్ను మోసం చేశాడు
కాలం కాన్వాసు మీద
ఆడద్దని బొమ్మకి నీ నెత్తురే పూశాడు

పొద్దు వెచ్చగా పొడుచుకొస్తున్నప్పుడో
పువ్వు స్వేచ్ఛగా విచ్చుకుంటున్నప్పుడో
రెక్కలతో పక్షులు ఆకాశాన్ని కొలుస్తున్నప్పుడో
అమ్మా నువ్వు పోగొట్టుకున్న సౌభాగ్యం
నాకు గుర్తుకొస్తుంది.

నాకు మగజన్మనిచ్చి
ఒక దుఃఖిత హృదయాన్నిచ్చి
రెండు కన్నీటి చెలమనిచ్చి
ఏ రాత్రీ నిద్రరాని జీవితాన్నిచ్చి
అమ్మా ఈ మగజాతి మీదిలా కసితీర్చుకున్నావా?

నువ్వు శపించు
శపించడం కన్నా దహించు
నీ దయగల నేత్రాలతో
ఎవరినీ క్ష్మమించకమ్మా క్షమించకు

ఎందుకమ్మా ఆ కన్నీరు
నువ్వో సారి శివాలెత్తి
ఆ నాలుగ్గోడలూ బద్దలుగొట్టుకు బయటకు రావే
నీ పాదాల దగ్గర కూర్చుని
మేం ఫెమినిస్టు పాఠాలు నేర్చుకుంటాం.

[అమ్మ నీళ్ళు మోస్తూ జారిపడిపోయినప్పుడు]

అశ్రు దేహం


రాత్రి కలలో తడిసిన అక్షరాలు
పొద్దున్నే నీరెండలో ఆరబోశాను
కోటి అంచుల జలఖడ్గ ప్రహారానికి
ముక్క ముక్కలైన నా దేహమే కనిపించింది.
ఒక అవయవాన్ని ఆదుకోడానికి
మరో అవయవం తాపత్రయం
కొట్టుకుపోవడమేగా తెలిసింది
ఏ చెట్టుకో చిక్కుకున్న నాకోసం నేనే ఆర్తనాదాలు

అభివృద్ధి నీటి గునపమై ఎన్ని గుండెల్లో దిగబడింది?
అడవుల్ని మాయం చేస్తూ వెళ్తున్న
కార్పోరేట్ మంత్రగాళ్ళు ..
తక్షణ స్వార్థం
ప్రకృతిని పిడికిట బంధించిన పరిణామం.
శ్రీశైలం...సాగర్...ప్రకాశం
కోండలకు తలబాదుకుంటూ...

ప్రవహిస్తున్నాని భ్రమిస్తూనే
నా తెలుగు తల్లి తనను తాను ముంచుకుంటే...
వరదెందుకొచ్చిందో తెలీక
ఆనకట్టల కనికట్టు తెలీక
ముందుచూపు మందగించిన
తాత్కాలిక ప్రయోజనాల ప్రయోజకులను చూసి
నవ్వాలో ఏడ్వాలో తెలీక...
నాదేహం తనను తాను ముక్కలు ముక్కలు చేసుకుంది.
పిచ్చిది...నీరవ్వడం తప్ప...
జాలిగా..నిద్రలోనో ...మెలుకువలోనో..
ద్రవించడం తప్ప దానికేం తెలుసు?
గ్లోబల్ వార్మింగ్..గ్లేషియర్ మెల్టింగ్ .. రైజింగ్ సీ లెవల్..
టెంపరేచర్ టెంపర్మెంట్..
వద్దు..వద్దు..
అభివృద్ధి నిరోధకా..
ప్రేలాపన ఆపు..
మనం వెచ్చగా ఉన్నాం..
పచ్చగా ఉన్నాం అదే పదివేలు...
భస్మాసుర హస్తాలు ఆపన్న హస్తాల్లు కావచ్చు
ముందు ఎన్నిహలేషన్...తర్వాత రిహాబిలిటేషన్
ఏమిటో కంచంలో అన్నం ముద్ద
కంఠంలోనే మొరాయిస్తుంది.
కప్పుకున్న దుప్పటి
కంకాళాల కంపుకొడుతోంది.
కౌగిలించుకున్న భార్యాపిల్లలు
నీటికత్తులై నా ఒంటి గట్టును
మృదువుగా ఒరుసుకుంటున్నారు
దయచేసి
వరద బాధితుల కోసం బయలుదేరుతున్న
ఏదో ఒక ట్రక్కులో
నా దేహం మూటను కూడా పడేయ్యండి
ఒక కన్నీటి బొట్టులోనైనా మునిగి పునీతమౌతా.

Sunday, January 3, 2010

బిల్కిస్ బానో


నిన్నెలా మర్చిపోవాలి?
అలా కవిత్వం పాడుకోవాలని
ఆకాశం వైపు చూస్తే
చుక్కలన్నీ నీ ముఖాలై
నన్నే చూస్తుంటాయి
నిన్ను తప్పించుకోవాలని
నా పిల్లల అమాయకపు కళ్ళల్లో తలదాచుకుంటే
అక్కడా నువ్వే
విలాపాల విషాద దృశ్యమై..

ఏ దేశం...ఏ ప్రాంతం
ఏ భాష...ఏ సంస్కృతి

ఆకాశమంత మచ్చ
ఏ వెలుగు నీళ్ళతో కడిగేయగలం?
విలువల కోసం కలలుకనే కళ్ళల్లో
ఇక నీ ముఖమే
గడ్డకట్టిన అశ్రుకణమై తిరుగుతుంది

నమ్మకాలను నమ్ముకున్న చేతులకు
నీ ముఖం బిగిసిన సూర్యుడంత పిడికిలవుతుంది
న్యాయపోరాటాల పాటకు పల్లవి ఇక నువ్వే
నిర్భయాల బతుకు పుస్తకాలకు
ముందు మాటవు నువ్వే
రోజూ నేను కలిపే అన్నంలో
మొదటి ముద్దవు నువ్వే.

[2002 గుజరాత్ ఊచకోతలో నిండు గర్భిణి బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. కుటుంబంలో అందర్నీ కోల్పోయినా..భర్త సాయంతో న్యాయ పోరాటం చేసి దోషులకు శిక్షపడేదాకా ఆగలేదు]

విధ్వంసం వినోదం


కరిగిపోతున్న నిలువెత్తు మంటల మంచు పలకలా మనిషి.
మనిషి చేతిలో నోరుపట్టనంత అన్నం ముద్ద
ఎండిన భూగోళంలా
అడవుల అన్వేషణలో
కార్పొరేట్ విమానాలు..
తూనీగల్ని నేలరాల్చుతున్న తూటాలు..
పారిపోతున్న ఆదివాసీల
వెన్నుపూసల చుట్టుకొలతల్ని కొలుస్తున్న లాఠీలు..
అభివృద్ధి మైనింగ్‍లో
మానవ కళేబరాల మహావిష్కరణ
పంచభూతాలను
కాలికింద తొక్కిపట్టిన మానవుడా!
నీ నెత్తిమీద కురుస్తున్న
ఆ మృత్యు హిమవర్ష సంగీతాన్ని
విన్నావా?

కాళ్ళు ఉద్యమించలేవు..
కళ్ళు ద్రవించలేవు
చేతులు కత్తులు కాలేవు
గళాల చుట్టూ కనపడని నిగళాలు
అరవయ్యో అంతర్జాతీయ
మానవ హక్కుల డిక్లరేషన్
మనిషి నోటికి పట్టిలా అతుక్కుపోయింది

మబ్బు నవ్వు

వెళ్ళిపోయిన వాళ్ళు
ఉన్నారు
ఉన్నవాళ్ళు లేరు
నిన్ను నన్ను చూసి
మీరొట్టి నీడలేనని
మేఘాలు నవ్వుతాయి
ఎముకల్లో ఏవో
శతాబ్దాల నాటి నవ్వుల కితకితలు

చిన్న మాట

అడవి ఉలిక్కిపడుతోంది
సైనికుడు బూటు చప్పుడు విని

సముద్రం జీన్ ఫ్యాంటు
పైకి లాక్కుంది
పోని చీర కుచ్చిళ్ళు వెనక్కి తీసుకుంది
మంచుకోండ చరియను చూసి

ఒక్క పాటైనా తన రెక్కమీద
వాలకపోతుందా అని
పక్షి ఉదయమే
చెట్టుని మెడలో తగిలించుకుని
పయనమవుతుంది

కవిగుండె విరుచుకుంటే
అక్షరాలు గ్లాసులో
ఐసు ముక్కలవుతాయి.

లిబర్‍హాన్

రెండుగంటల విధ్వంసం
రెండు దశాబ్దాల విచారణ
తూర్పు సింహాసనంపై
సూర్యుడు తీర్పు ప్రకటిస్తాడు
గాల్లో కదలుతున్న బాధితులు
పడమటి కోండలకు
తలలు బాదుకుంటారు
దోషులు రాత్రి పార్టీలో
సూర్యుడి నెత్తిమీద
చుక్కల్ని కుమ్మరిస్తారు
ప్రజాస్వామ్యం బురుజు చుట్టూ
చీకటి పహరా

కలల పాపలు

పక్షి..ప్రవాహం
మంచు..పువ్వు
కిరణం..వాన..మబ్బు
చెట్టు..నీడ..వెలుగు..వెన్నెల
పగలు..రాత్రి
నాకలల్లో ఆడుకునే
పసిపాపలు

కన్నీళ్ళు

పిరికివాడి
చర్మంలోపల
గడ్డకట్టిన నెత్తుటి పగుళ్ళు

నిశ్యబ్దం

మాటలు రాని చెట్టుని
ఏదిపిస్తూ
అటూ ఇటూ
తిరిగే నీడ

మౌనం


అక్షరాన్ని ఆయుధం
చేయలేని
చేతకానితనం

కల్చరల్ డాగ్

జాగ్రత్త గురూ
రెచ్చిపోయి నీదేశం దరిద్రాన్ని అక్షరీకరిస్తానేమో..
పేట్రేగి నీదేశం మత హింసను
రంగుల్లో దృశ్యమానం చేస్తావేమో
ఆందోళనతో నీదేశంలో అన్యాయాలను...అక్రమాలను
ఖండిస్తూ నిప్పుల సంగీతమై మండిపోతావేమో..
జాగ్రత్తరా బాబూ!
దేశభక్తులకు ఆగ్రహం వస్తుంది
నిన్ను దేశద్రోహిగా చిత్రీకరించి చించిపారేస్తారు

నీకళ్ళముందు మురికిని మిన్నేటి పరికిణిలా వర్ణించాలి
నీ ముందు పడివున్న భిక్షు వర్షీయసిని
ఐశ్వర్యరాయ్ గానో...శిల్పాశెట్టిగానో అభివర్ణించాలి..
భద్రం తమ్మీ!

ఆకలి ఇండెక్స్ లో మనదేశం అగ్రస్థానంలో ఉందని
కరిగికరిగి కన్నీరయ్యేవు సుమా!
సంస్కృతీ పరిరక్షకులకు నరాలు తెగుతాయి
నువ్వు సొంతదేశం దరిద్రాన్ని అమ్ముకునే
పరాయిదేశం కిరాయి రాతగాడిగా కీర్తికెక్కుతావు
ఆకలి చావులనైనా...ఆత్మహత్యలనైనా
అదృష్టవంతులకు స్వర్గప్రాప్తి దొరికిందని భావప్రాప్తి పొందాలి

గ్రోత్ చూడరా నాయనా!
ప్రసూతి మరణాల్లోనో..బాలకార్మికుల హననాల్లోనో కాదు
నిర్వాసితుల కన్నీళ్ళల్లోనో...నిర్భాగ్యుల పీడకలల్లోనో కాదు
సెవన్ పాయింట్....ఎయిట్ పాయింట్...నైన్ పాయింట్
అద్గదీ పాయింట్! అంకెలు చూడు
అంకెల్లో అభివృద్ధి చూడు
లేకుంటే కరుస్తాయి...నీ గుండెనిండా గాట్లుపెట్టి అరుస్తాయి
యూ స్టుపిడ్ డాగ్!
బీవేరాఫ్ కల్చరల్ డాగ్స్!!

కవిత్వం


నిన్ను విడిచిపెట్టలేను
అలాగని ఒడిసిపట్టనూ లేను
చుక్కలన్నీ గాలిపటాలు చేసి
నా ముందు ఎగరేసి
నన్ను పిల్లాడిని చేసి
అకాశంలా ఎగిరిపోతావు

నిన్ను పిలవకుండా ఉండలేను
అలాగని నీచెంత నిలవనూలేను
పచ్చని పొలాల పసిడికంకుల పాలపొట్టల్లో
చావు పుట్టకల రహస్యాలు విప్పే
సంధ్యా గీతానివి నువ్వు

నిన్ను తెరవకుండా ఉండలేను
కానీ మూయకుండానూ ఉండలేను
జ్వరం ఒంటిమీద అమ్మచేతి స్పర్శవు నువ్వు
స్కూలు బస్సులోంచి టాటా చెప్తున్న
పిల్లల నవ్వు కళ్ళకాంతివి నువ్వు
దాహంగా ఉన్నప్పుడో...ఆకలేసినపుడో
నీటికోసమో అన్నం కోసమో కాదు..
నీకోసమే చూస్తాను
నువ్వున్నావన్న నమ్మకంలోనే కాని..
ఈ ఊపిరిలో ఇంత వెచ్చ్దనం ఎక్కడిది?

నిన్ను చేరుకోవాలనుకుంటాను
నీ నుండి పారిపోవాలనీ అనుకుంటాను
అబద్ధాలు గుచ్చుకుంటున్నప్పుడో
ఆశ్రయమిచ్చింది నువ్వే కదా!
ఎన్ని రాత్రులు నీకోసం
కర్పూరహారతి పట్టలేదు
నీ చూపుల ఖడ్గ చాలనంలో
గుండెల్లోంచి ఒక్కో నెత్తుటి చినుకై
కురిసినవే ఈ అక్షరాలు.

ఔను వాళ్ళు మనుషులు కదా!


కోపెన్ హాగెన్‍లో
దేవతలు సమావేశమవుతున్నారనుకున్నాను
కానీ
అక్కడా మనుషులే.

చర్మం మీదా జీవితం మీదా
పొరలు పొరలుగా అట్టలు కట్టిన
లక్షల టన్నుల కార్బన్‍డయాక్సైడ్‍తో
అక్కడా మనుషులే.

పంచేంద్రియాల నుండి
గ్రీన్ హౌస్ గ్యాసెస్..
మరి ప్రసంగాలు మాత్రం
ప్రాణవాయువు మీదే.

భవిష్యత్తు గురుంచి
దేవుడు మాట్లాడుతున్న శిఖర సమావేశంలో
మృత్యువే ముఖ్య అతిథి.

కనీసం
డెన్మార్కులోనైనా
ఒక సన్మార్గం దొరుకుతుందనుకున్నాను
అక్కడా మనుషులే
పిల్లల చేతుల్లో భూగోళం...
వేటగాడిని చూసి వణికిపోతున్న పిట్టలా.

[విఫలమైన కోపెన్ హాగెన్‍ సమావేశానికి నిరసనగా]

ఆ కళ్ళు


ఆ కళ్ళు
ఎన్నో రాత్రులు నక్షత్రాలను
మంచులో కడిగి దాచుకున్న
పూల సంచుల్లా వుంటాయి.

కొన్ని సార్లు
పసిపిల్లల పాదాల్లాగ
అరడగు చుట్టుకొలతలో ఒదిగిన
ఆకుపచ్చ అడవుల్లా వుంటాయి.

జొన్న కంకుల మీద వాలి
పొట్టనింపుకుని
ఎగరలేక అక్కడే
నిదరోయిన పిచ్చుకల్లా వుంటాయి..

తామరాకు మీద
నీరెండ స్నానమాడే
బోసిదేహాల చేపపిల్లలా వుంటాయి.

రాత్రి కల్లలో వినిపించే
రఫీ పాటల్లాగో...
పగటి ఊహల్లో ఊరే
వెన్నెల ఊటల్లాగో..
గుండెను ఊపుతూ వుంటాయి
తడుపుతూ వుంటాయి...

పసుపుబట్టల్లోని కూతురికి
వీడ్కోలు చెప్తున్న
అమ్మానాన్నల మనసు తడి
చుక్కలు వారిన చెట్ల నుండి
వీచేగాలి సవ్వడి
ఆ కళ్ళ నుండి
నిత్యం రాలే నవ్వుల పూల పుప్పొడి.