Monday, January 4, 2010

కవి


ఎన్నడూ ఓ ముద్దకూడా వెయ్యని ఇంటిముందు
రోజూ విధిగా నిలబడే బిచ్చగాడిలాగా
ఈ జీవన వాకిలిముందు నిలబడి
వాడు కవితా గానం చేస్తాడు
మనం తలుపులు మూసేసుకుంటాం.

జీవితాన్ని ప్రేమించలేనివాడు
కవిత్వాన్ని ప్రేమించలేడు.

నాకు కవులంతా యుద్ధభూమిలో నెత్తురోడుతున్న
సైనికుల్లా కనబడతారు.
మనం రాత్రుల్ని వెలిగించుకుని చలికాచుకుంటాం
వాడు రాత్రుల్లో మండిపోతాడు మాడిపోతాడు మసైపోతాడు

గుండెకి ఒక కొసన నిప్పంటించుకుని
ఒక అక్షరానికి ఓ కన్నీటిచుక్క
ఒక అక్షరానికి ఓ నెత్తుటిబొట్టు ఇచ్చి
అక్షరాల్లోకి అంతర్థానమైపోతాడు

కవిగాడిని చూడ్డవూ
మిట్టమధ్యాహ్నం రవిగాడిని చూడ్డవూ ఒక్కటే

దూరిపోతాం
ఇళ్ళ దుప్పట్ల కౌగిళ్ళ సొరంగాల్లోకి దూరిపోతాం
ముందు తలదూర్చి
తరువాత కాళ్ళూ చేతులూ దేహాలూ లాక్కుని
హాయిగా నిద్రపోతాం.
కవిగాడు కావుకావుమంటూ
మన నీడల మేడల పిట్టగోడల మీద
అలుపులేకుండా అరుస్తాడు
ఎవరో చుట్టం వస్తున్నాడని
చూట్టానికి సాహసిస్తాం.

వలయాలు వలయాలుగా శూన్యం
ఇంటి చుట్టూ కన్నాలు
కన్నాల్లో కన్నీటి తడి
దొంగ కనీటి దొంగ!

తలుపులు మూసుకుని ఏడ్చినా
మన కనీటిని దోచుకుపోయేవాడు కవే
కనీటి కుండల్ని నెత్తిమీద ఒక దానిపైనొకటి పేర్చుకుని
ఎర్రటి మన గుండెల నిప్పుల మీంచి వాడు
పీరుసాయిబులా నడుచుకుంటూ పోతాడు

సిగ్గు పడతాం ముడుచుపోతాం
వాడు పాటలపిట్టల రెక్కల కుచ్చులతో
మన రెప్పలచివర్ల అశ్రుకణాల్ని తుడిచి
మనల్ని ఏడవొద్దని వోదారుస్తూ
వాడు బావురుమని ఏడ్చేస్తాడు

పలకరించామా
మనల్ని ఆరణ్యాల్లోకి విసిరేస్తాడు
క్రూర మృగాలతో మనం పోరాడలేక
వెనక్కి తిరిగి పోతున్నప్పుడు
మనల్ని దారికాచి నిలబెట్టి ఆయుధాన్నిచ్చి
తిరిగి యుద్ధానికి పంపుతాడు

కవిని ముట్టడమూ
కత్తిని చేపట్టడమూ ఒక్కటే.

No comments:

Post a Comment