Wednesday, January 6, 2010

రోడ్డు మీద పికాసో


ఎవరెవరికి ఏ విధంగా తెల్లారినా
మా పికాసోకి మాత్రం
రోడ్డు మీదే తెల్లారుతుంది
రోడ్డు ప్రసవించిన కొత్తరంగు వాడు

బాలార్క కిరణాలు ఇంకా
బజారున పడకముందే
అదృష్టవంతులు దుప్పటి ముసుగులింకా
తీయ్యక ముందే
మా వాడు
రాత్రంతా తనదేహాన్ని కాపలా కాసిన
చినుగుల చొక్కా ఊడదీసి
రోడ్డు ఊడ్వడం ప్రారంభిస్తాడు
దీక్షగా రోడ్డు తల్లి దేహాన్ని శుభ్రం చేసి
ఆకలి పచ్చబొట్లు పొడవడానికి ఉపక్రమిస్తాడు
ఆకలి ఏ రంగులో ఉంటుందో
మా వాడే చెప్పగలడు
రోడ్డు పెగుతెంచుకు పుట్టిన పికాసోవాడు

ఆకలి వాడిని తరిమితే
వాడు రోడ్డును తడుముతాడు
రోడ్డు కాన్వాసుమీద వాడు
చిత్రకళా బీజాక్షరాలు చెక్కుతాడు
తల దాచుకోవడానికి
ఎక్కడా చోటు దొరక్కపోయినా
తన కళదాచుకోడానికి
రోడ్డు ఆశ్రయమిచ్చింది వాడికి
అవతరిస్తారు
ఏడుకొండలవాడూ ఏసుక్రిస్తు మహమ్మదు ప్రవక్త
పక్కపక్కనే
కులాలూ మతాలు కత్తులు దూసుకునే చోట
మసీదులూ మందిరాలూ నెత్తురు జుర్రుకునే చోట
మా వాడు మతసామరస్యాన్ని
సుద్దముక్కలతో అద్దం పట్టిస్తాడు

వేసిన బొమ్మదేవుళ్ళకి
చిల్లర రాళ్ళను కాపలా పెట్టి
చేతి సంచీ పట్టుకుని చిటుక్కున మాయమవుతాడు
ఎక్కడ కూర్చుంటాడో గాని
ఇక్కడ బొమ్మమీద ఒక నాణెం పడితే
అక్కడ మావాడికి పొట్టమీద్ చెయ్యేసి
అమ్మ ఆప్యాయంగా తడిమినట్టనిపిస్తుంది

జనం చూస్తుంటారు
ఏ రక్తం ఈ రంగుల్ని రాల్చిందో
ఏ ఆకలి పేగుల పాములు చుట్టలు విప్పుకుంటున్నప్పుడు
ఆ బొమ్మ రూపుగట్టిందో
అర్థమైనట్టే తలలు ఆడిస్తారు
ఇటుపోయేవాడొక నాణెం
అటుపోయేవాడొక నాణెం

తన పొట్ట కొడుతున్నాడని
కసితో కాండ్రించి ఉమ్మేద్దామని వచ్చిన బిచ్చగాడుకూడా
అప్రయత్నంగా సత్తుగిన్నెలో మిగిలిన
ఒక్కనాణేన్నీ బొమ్మమీద విసిరేసి
ఆ సందువదిలి
ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు
సద్దు మణిగిపోతుంది
పగలంతా బొమ్మకు కాపలా కాసిన సూరీడు
బత్తెం మాట అడక్కుండానే
చిత్తం వెళ్ళొస్తానంటాడు
అందరూ తమతమ దేహాల్ని శుభ్రం చేసుకుని
మంచాలకెక్కించేవేళ
ఏ అనాధాశ్రయంలోనో
కన్నబిడ్డను వదలలేక వదలలేక
వదిలిపోయే అభాగ్యురాలిలాగా
తన బొమ్మను రోడ్డుకే అంకితం చేసి
వాడు మరోచోటుతి
మౌనంగా వెళ్ళిపోతాడు.

No comments:

Post a Comment