హలో డియర్ బాగున్నావా!
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడిలా,
నిన్ను చూద్దమని
నీ గుండెల మీద నా పద్యాన్ని కప్పిపోదామని వచ్చాను
ఏది ఆ చేయిటివ్వు
నీకు గుర్తుందో లేదో గాని సముద్రమా
ఈ తీరంలో ప్రతి రేణువు మీద
నా అక్షరాల తీపి మరకులున్నాయి
నీ అలల అవయవాలమీద
కరిగిన నా కలల కర్పూర కళికల చారలున్నాయి.
అప్పుడు నేనో నవనవోన్మేష జీవన గీతాన్నయితే
నువ్వో నిత్యనూతన యవ్వన రాగానివయ్యేదానివి
నేనూ నా ప్రేయసి తీరానికి చేరుకోగానే
చందమామ పఫ్‍తో వెన్నెల పౌడర్ నీ ముఖానికద్దుకుని
నీలాకాశం జిలుగుపైట గుండెల మీద పరుచుకుని
కెరటాల శిరోజాలు ఎగరేస్తూ వచ్చేదానివి
మేమిద్దరం పొద్దు తెలియని ముద్దుల్లో మునిగిపోతే
అలిగి నీ అలల పిర్రల్ని దులుపుకుంటూ వెళ్ళి పోయేదానివి
నువ్వూ నా ప్రాణసఖి చెరో నడుస్తుంటే
ప్రపంచం కుక్క పిల్లయి నా కాళ్ళ దగ్గర కువకువలాడేది
ఒక సారి అలా పీచీకల పేజీలను వెనక్కి తిప్పితే
ఒకనాటి నా జ్ఞాపకాల ఇంద్రచాపం వెల్లి విరుస్తుంది
నీకు తిపించిన ప్రేమ కబుర్ల శెనక్కాయలు
నీ గొంతులో నే క్రుమ్మరించిన ప్రణయగీతాల కూల్ డ్రింకులు
నీకు రుచిచూపించిన తీపి ముద్దుల ఐస్ క్రీములు
నిజంగా భలే బాగుండేది కదూ!
నువ్వు కెరటాల చేతులతో నా పాదాలను అల్లుకుపోయినప్పుడు
శబ్దాలకెక్కని కవిత్వాన్ని కలగంటూ
నేనెలా కరిగికరిగి నీలో కలిసి పోయేవాడిని!
నా ప్రియురాలు అలిగి కూర్చున్నప్పుడు
నువ్వు నడిపిన నీటితుంపర్ల తుంటరి రాయభారం
నేనింకా మర్చిపోలేదు.
పాలనురుగుల పట్టుదారాలతో
నూవల్లిన తివాచిమీద
నా చెలి పాదాలు మోపినప్పుడు
ఇసుక తిన్నెల పత్రాల మీద నేను రాసిన పద్యాలన్నీ
ఉరుకుతూ వచ్చి ఉడాయించుకు పోయేదానివి
అప్పుడామె ఎంత ఉడుక్కునేదో నీక్కూడ తెలుసు
హృదయేశ్వరి నా కన్నుల్లోకి చూస్తూ
కవితవం చెప్పమన్నప్పుడు
నువ్వు అలల సంగీతాన్ని జతచేసి
కలల మెహఫిల్‍ని సజాయించేదానివి
మళ్ళీ నీ లోలోపలికి దిగాలనుంది
మళ్ళీ నీ దేహంతో దాహంగా ఆడుకోవాలనుంది
నీ కళ్ళల్లో నా కవిత్వాన్ని వొంపి
ఆ వెలుగులో లోకాన్ని చూడాలనివుంది
నీ అలల వక్షోజాలమీద
నా అక్షరాలు తలలు వాల్చిన అనుభూతిని
చిత్రాతి చిత్ర వర్ణాలతో చిత్రించాలని వుంది
ఏది ఆ చేయిటివ్వు
కనీసం ఇప్పుడైనా
నిన్ను నాతో తీసుకు పోవాలనుంది.
[మొన్నామధ్య విశాఖ సముద్రాన్ని కలిసిన సందర్భంలో]
No comments:
Post a Comment